X Close
X
+91-9846067672

సాయిబాబా ఎక్కడ పుట్టారో తెలుసా ?


సాయిబాబా ఎక్కడ పుట్టారో తెలుసా ?

 సాయిబాబా ... ఈయనకు భారతదేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. భక్తులైతే ఉన్నారు గానీ ... సాయిబాబా గురించి చాలా మందికి తెలియనిది అయన ఒరిజినల్ పేరు, అయన పుట్టిన ప్రదేశం. వీటి గురించి తెలియక చాలా మంది పుస్తకాలు, పాత ఆర్టికల్స్ తిరుగేస్తుంటారు. కానీ మొన్నీమధ్యనే అయన పుట్టిన ప్రదేశం వెలుగులోకి వచ్చింది అదే పత్రి. పత్రి సాయిబాబా కాలంలో ఒక గ్రామం. కానీ నేడు ఒక సిటీగా మరియు మున్సిపల్ కౌన్సిల్ గా అవతరించింది. మహారాష్ట్ర రాష్ట్రంలోని పర్భనీ జిల్లాలో పత్రి సిటీ కలదు. ఈ సిటీ ప్రధాన ఆకర్షణ ఆయన జన్మించిన ఇంటిస్థానంలో కట్టిన శ్రీ సాయి జన్మస్థల్ టెంపుల్. ఈ మందిరాన్ని దర్శించుకోవటానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

 శ్రీ సాయి జన్మస్థాన్ ఆలయం, పత్రి శ్రీ సాయి జన్మస్థాన్ ఆలయం (సాయిబాబా పుట్టిన ఆలయం) లో షిర్డీ సాయిబాబా జన్మించెను. ఈ ప్రదేశాన్ని మొట్టమొదట సాయిబాబా భక్తుడు మరియు రీసెర్చర్ అయిన వి.బి. ఖేర్ 1975 వ సంవత్సరంలో కనిపెట్టెను. ఈయన శ్రీ సాయి స్మారక కమిటీ (సాయి మెమోరియల్ కమిటీ) ఏర్పాటు చేసి అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించాలని అనుకొని సాయి పుట్టిన ఇంటిని కొనుగోలు చేసి 1994 లో పనులు మొదలుపెట్టి, 1999 లో దీనిని జాతికి అంకితం చేసెను. ప్రముఖ స్వామీజీలైన పుట్టపర్తి సాయిబాబా, మాధవనాథ్ లు కూడా 'పత్రి' నే సాయిబాబా జన్మస్థలంగా నిర్ధారించారు.

 ఆలయం నిర్మించేటప్పుడు సాయిబాబా జన్మించిన ఇంట్లో దొరికిన వస్తువులు మరియు పునాదులు మరియు ఇతర పరికరాలను మందిర ప్రాంగణంలో చూడవచ్చు. 

 ఆలయంలో నిత్యం జరిగే కార్యక్రమాలు కాకడ్ హారతి - ఉదయం 5 గంటల 15 నిమిషాలకు, మంగళ స్నానం మరియు హారతి - ఉదయం 7 గంటలకు, మధ్యాహ్న హారతి - మధ్యాహ్నం 12 గంటలకు, సంజ్ హారతి (సంధ్యా హారతి) - సూర్యాస్తమం సమయంలో, షెజారతి - రాత్రి 10 గంటలకు. ఆలయంలో జరిగే మూడు రోజుల పండుగలు శ్రీరామనవమి - చైత్ర శుద్ధ నవమి (మర్చి/ ఏప్రియల్),  శ్రీ వ్యాస - గురుపూర్ణిమ (జులై నెలలో), సాయిబాబా మహాసమాధి - విజయదశమి (దసరా)- అశ్విన్ శుద్ధ దశమి (అక్టోబర్).

 వసతి సౌకర్యాలు శ్రీ సాయి జన్మస్థాన్ మందిరం ప్రాంగణంలోనే భక్తి నివాస్ వసతి గృహాలు ఉన్నాయి. ఇక్కడ ఒకేసారి 200 మంది వరకు ఉండవచ్చు. ఈ సంఖ్యను మరింతగా పెంచాలని ఆలయ ట్రస్ట్ ఆలోచిస్తున్నది. భక్తులందరికీ వసతి నామమాత్రపు ధరలలోనే లభిస్తుంది మరియు ఇక్కడే ఉన్న ప్రసాదాలయంలో భోజనం చేయవచ్చు. డొనేషన్ వివరాల పట్టిక అన్నదానం - 151 రూపాయలు, సాధారణం - 31 రూపాయలు, అభిషేకం - 51 రూపాయలు, బిల్డింగ్ ఫండ్స్ - మీకు తోచినంత, కాయంస్వరూపి అన్నదానం - 2500 రూపాయలు, శ్రీ సాయి సత్యనారాయణ్ - 151 రూపాయలు, పాదుకా అభిషేకం - 125 రూపాయలు.

 పత్రి పట్టణానికి ఎలా చేరుకోవాలి ? పత్రి పట్టణానికి చేరుకోవటానికి రైలు, బస్సు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పత్రి సమీప విమానాశ్రయాలు - నాందేడ్ (91 కి.మీ), ఉస్మానాబాద్ (130 కి.మీ), ఔరంగాబాద్ (130 కి.మీ), అకోలా(170 కి.మీ), బీదర్ (180 కి.మీ). పత్రి సమీప రైల్వే స్టేషన్ లు - పత్రి లో రైల్వే స్టేషన్ లేదు. కనుక యహ్త్రికులు ఔరంగాబాద్, సేలు (24 కి. మీ), మన్వత్ రోడ్(15 కి. మీ), పర్బనీ (46 కి.మీ) రైల్వే స్టేషన్ లలో దిగి అక్కడి నుంచి బస్సుల ద్వారా పత్రి చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుండి ఔరంగాబాద్ కు ప్యాసింజర్ రైలు ఒకటి నడుస్తుంది. బస్సు మార్గం / రోడ్డు మార్గం - పత్రి లో బస్ స్టాండ్ ఉంది. ఇక్కడకు పర్భానీ, ఔరంగాబాద్, మన్వత్ రోడ్ తదితర సమీప పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు / ప్రవేట్ వాహనాలు తిరుగుతుంటాయి.