X Close
X
+91-9846067672

భారతదేశంలో సంగీత స్తంభాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ?


భారతదేశంలో సంగీత స్తంభాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ?

సంగీతం గురించి భారతదేశానికి తెలిసినంతగా మరే దేశానికి తెలిసిఉండదు. సంగీతం ఆది ప్రణవనాదం నుండి ఉద్భవించింది అని అందరికీ విదితమే. సినిమా సంగీతానికి, భారతీయ సంగీతానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది వినటంలోనూ, ప్రదర్శించడంలోనూ..! సంగీతం అంటే శబ్దాన్ని కాలంతోపాటు మేళవించి వినసొంపుగా వినిపించే అద్భుత ప్రక్రియ. సంగీతవాయిద్యాలతో చేసే సంగీత సాధనే కష్టంరా దేవుడా అనుకుంటే ... రాతిని తాకితే సరిగమపదనిస స్వరాలు వచ్చే స్థంభాలు భారతదేశంలో నిజంగా అద్భుతమనే చెప్పాలి. భారతదేశంలో ఈ రాతి స్థంభాలు భారతీయ కళలకు, సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనాలు. ఇలాంటి రాతి స్థంభాలను సుమారు వెయ్యి సంవత్సరాల క్రితమే ఉద్భవించాయి. దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో వీటిని చూడవచ్చు. దక్షిణ భారతదేశాన్ని పాలించిన ఎంతో మంది రాజులకు సంగీతం అంటే మహా ఇష్టం. వీరికెప్పుడు కాలక్షేపం దొరికినా సంగీతాన్ని వినేవారు, ఆస్వాదించేవారు. సంగీతం ను విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంలో అప్పటి రాజులు కంకణం కట్టుకొని యాత్రికులు ఎక్కువగా దర్శించే ఆలయాలలో మ్యూజికల్ పిల్లర్స్ ను ఏర్పాటుచేశారు. ఎప్పుడైనా రాజులు దేవాలయానికి వెళితే గుడి మధ్యలో కూర్చొని ఈ స్థంభాల దగ్గర విద్వాంసులు చేసే కచేరీ లను, అందుకు తగ్గట్టు నాట్యం చేసే నర్తకీమణుల నృత్యాలను చూస్తూ ఉండేవారట. 

 01. హంపి విఠల దేవాలయం విఠల దేవాలయం విష్ణమూర్తి దేవాలయం. ఇది 16వ శతాబ్దం నాటిది. ఎంతో అందమైన శిల్పశైలికల దీనిని హంపి వెళ్ళే పర్యాటకులు తప్పక చూడాలి. దీనికి సాటి అయిన దేవాలయం మరొకటి లేదు. ఈ దేవాలయం తుంగభద్ర నది దక్షిణం ఓడ్డున కలదు. అసలైన దక్షిణ భారత ద్రవిడ దేవాలయ శిల్పశైలి దీనిలో కనపడుతుంది. విఠల దేవాలయం రాజు దేవరాయ II పాలనలో నిర్మించబడింది. అలంకరించబడిన స్తంభాలు, చెక్కడాలు కల ఈ దేవాలయం పర్యాటకులకు అద్భుత ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ మీరు చూడవలసినది రంగ మంటపం మరియు 56 మ్యూజికల్ స్తంభాలు. వాటిని ముట్టుకుంటే చాలు సంగీతం వస్తుంది. ఏక శిలతో నిర్మించిన రధం ప్రధాన ఆకర్షణ.

 02. మధురై మీనాక్షి ఆలయం తమిళనాడు లోని మధురై మీనాక్షి ఆలయంలో కంపించే రాతి స్తంభాలు కలవు. ఈ దేవాలయాన్ని దర్శించే యాత్రికులు తమ పిడికెళ్ళతో రాతి స్తంభాలను కొట్టి, అవి ఉత్పత్తి చేసే సంగీత ధ్వనులను ఆస్వాదిస్తుంటారు. 500 ఏళ్ళ క్రితం సంగీతకారులు సంగీతాన్ని ఉత్పత్తిచేసేందుకు చేతి కర్రలను ఉపయోగించేవారట. వెయ్యి స్థంభాల మండపంలో రెండు, దేవాలయం ఉత్తర ద్వారం వద్ద ఐదు రాతి స్థంభాలను చూడవచ్చు. 

 03. తిరునల్వేలి నెల్లై అప్పర్ దేవాలయం తమిళనాడులోనే తిరునల్వేలి నెల్లై అప్పర్ దేవాలయం పెద్దది. క్రీ.శ. 7 వ శతాబ్దం మొదట్లో పాండ్యులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇందులో శివ, పార్వతి విగ్రహాలు ప్రధాన ఆకర్షణ. పురాణాల ప్రకారం శివుడు తాండవ నృత్యం చేసిన ప్రదేశం కావున ఈ దేవాలయంలో ఇప్పటికీ శాస్త్రీయ నృత్యాలు మరియు ఇతర కళా నృత్యాలు నిర్వహిస్తుంటారు. ఈ దేవాలయంలో కూడా రాతి స్థంభాలను ముట్టుకుంటే సంగీతం ఉత్పత్తి అవుతుంది. ఈ సంగీత స్థంభాలను సంగీతకారులు ఒకేసారి తాటనం (తడితే) చేస్తే వివిధ రాగాలను వినవచ్చు.

 04. సుచింద్రం థనుమలయన్ ఆలయం దక్షిణా భారతదేశంలో ఉన్న తిగొప్ప ఆలయాలలో ఇది ఒకటి. ఈ దేవాలయం గోపురం ఎత్తు 134 అడుగులు. గోపురం పై దేవుళ్ళు, దేవతల బొమాలతో పాటు పురాణ గాధల చిత్రాలను చెక్కినారు. శివుడు, విష్ణువు తో పాటు 30 వరకు ఇతర దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ధ్వనింపజేసే రాతి స్తంభాలు ఉన్నాయి. వాటిని తాకగానే సంగీత ధ్వనులు వినిపిస్తాయి. ఈ స్తంభాలను నిర్మించిన కళాకారులకు శరీరంలో కంపించే సూత్రాలు స్పష్టంగా తెలుసు.

 05. అల్వార్ తిరునగరి అధినాథ పెరుమాళ్ ఆలయం ఇది ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రం. ఈ క్షేత్రం సమీపంలోనే నవ తిరుపతులు ఉన్నాయి. ఇంద్రుడు పాపముల నుండి విముక్తిపొందటానికి అధినాథ పెరుమాళ్ళను సేవించి విముక్తి పొందాడని ఐతిహ్యం. ఈ దేవాలయంలో కూడా మ్యూజికల్ పిల్లర్స్ చూడవచ్చు.