X Close
X
+91-9846067672

కాకతీయులు నిర్మించిన అద్భుత దేవాలయాలు !


కాకతీయులు నిర్మించిన అద్భుత దేవాలయాలు !

తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలుపుకొని, ఓరుగల్లుని రాజధానిగా చేసుకొని 350 ఏళ్ళు పాలన సాగించిన కాకతీయులు చరిత్ర పుటల్లో చోటు సంపాదించుకున్నారు. నాడు ఓరుగల్లు గా, ఏకశిలానగరం గా పిలువబడే నేటి వరంగల్ జిల్లా లో కాకతీయులు నిర్మించిన అనేకానేక కట్టడాలు చారిత్రక ఆనవాళ్ళుగా నిలిచాయి. వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండవ పెద్ద నగరం. హైదరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడికి వెళ్ళటానికి రాష్ట్రం నలుమూలల నుండి బస్సులు, రైళ్లు వంటి రవాణా సాధనాలు అందుబాటులో ఉన్నాయి.

కాకతీయుల కాలం నాటి రెండు ప్రసిద్ధ కట్టడాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి కాకతీయుల సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా, భావితరాలకు వారసత్వ సంపదగా మిగిలాయి. రామప్ప దేవాలయం, వేయి స్థంబాల గుడి భారతీయ సంస్కృతికీ, హైందవ శిల్ప కళ కు ప్రతీకగా నిలిచాయి.

రామప్ప దేవాలయం:రామప్ప దేవాలయం వరంగల్ పట్టణం నుండి 70 కి. మీ ల దూరంలో పాలంపేట అనే ఊరిలో ఉన్నది. దీనినే రామేశ్వరాలయం అని కూడా పిలుస్తారు. రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్పకళా నైపుణ్యం వర్ణించవికానివి. ఈ కాకతీయుల శిల్పకళా చాతుర్యం ఇన్నేళ్లు గడిచినా వన్నె తగ్గకుండా చూపరులను ఆకట్టుకుంటున్నది. గుడిలో నల్లనిరాతి నాట్యకత్తెల విగ్రహాలు, స్తంభాలపై శిల్పాలు శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి.

వేయి స్థంబాల గుడి హన్మకొండ లోని వేయిస్తంభాల గుడిని క్రీ. శ. 11 వ శతాబ్దంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు నిర్మించాడు. ఇది ఒక చారిత్రాత్మకమైన హిందూ దేవాలయం. ఇందులో శివుడు, విష్ణువు మరియు సూర్యుడు మొదలైన హిందూ దేవుళ్ళ, దేవతల ప్రతిమలు ఉన్నాయి. ఈ కట్టడం నిర్మించటానికి దివ్యంగా చెక్కబడిన వెయ్యి స్తంభాలను ఉపయోగించారు. కనుకనే గుడి కి వేయి స్థంబాల గుడి అనే పేరొచ్చింది.

గుడి ప్రవేశ ద్వారం వద్ద నంది విగ్రహం, నక్షత్ర పీఠం పై రుద్రేశ్వరుడు కొలువై ఉన్నారు. ఆకట్టుకొనే గుడి తలుపులు, ఆలయ మండపం పై లతలు, పుష్పాలు , నాట్య భంగిమలో స్త్రీలు, పలు పురాణ ఘట్టాలను తలపించే శిల్పాలు మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి.

వరంగల్ కోట వరంగల్ లో మరో చారిత్రక సంపద వరంగల్ కోట. గణపతి దేవుడు 1199 లో కోట భావన నిర్మాణం ఏర్పాటు చేసాడు మరియు 1261 లో అతని కుమార్తె రుద్రమదేవి పూర్తి చేసింది. ఇది వరంగల్ పట్టణానికి 2 కి. మీ ల దూరంలో కలదు. కోట యొక్క కీర్తి తోరణాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం గా వాడుకలో ఉన్నది.

వరంగల్ చేరుకోవటం ఎలా ?

వాయుమార్గం : వరంగల్ కు 150 కి. మీ ల దూరంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి వరంగల్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : వరంగల్ లో రైల్వే స్టేషన్ కలదు. దీనిని కాజీపేట రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు. ఢిల్లీ, బెంగళూరు, సికింద్రాబాద్, ఖమ్మం, విజయవాడ తదితర ప్రాంతాల నుండి స్టేషన్ మీదుగా రైళ్లు వెళుతుంటాయి.

బస్సు మార్గం : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి వరంగల్ కు బయలుదేరుతాయి. హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు లభిస్తాయి.