X Close
X
+91-9846067672

చైనాలో పిల్లల సంఖ్యపై ఇక నో లిమిట్!


china-onechild-playgrnd-facebookJumbo

బీజింగ్ : పౌరులకు ఉండవలసిన సంతానం సంఖ్యపై దీర్ఘకాలంగా ఉన్న పరిమితులను ఎత్తివేసే దిశగా చైనా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. దేశంలో కుటుంబ నియంత్రణ విధానాలను అమలు చేస్తున్న మూడు సంస్థలను చైనా రద్దు చేసింది. జనాభా పర్యవేక్షణ, కుటుంబాల అభివృద్ధి పేరిట ఒకే డివిజన్‌ను ఏర్పాటు చేసింది. జాతీయ ఆరోగ్య కమిషన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మార్పులు చేసింది. దీంతో పౌరుల సంతానంపై విధించిన ఆంక్షలు త్వరలోనే తొలిగిపోతాయని ఆ దేశ పౌరులు భావిస్తున్నారు. చైనా ఇటీవల విడుదల చేసిన ఒక స్టాంపు కూడా వారిలో ఆశలు రేకెత్తించింది. మూడు పంది పిల్లలతో పాటు నవ్వుతున్న ఆడ, మగ పందులు ఉన్న స్టాంపును చైనా విడుదల చేసింది.

చైనాలో వయోవృద్ధుల సంఖ్య పెరుగడం, పనిచేసే వారి సంఖ్య తగ్గిపోవడంతో దీర్ఘకాలంగా అమలులో ఉన్న ఒకే బిడ్డ విధానాన్ని 2016లో ప్రభుత్వం రద్దు చేసి ఒక జంట ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతించింది. దీంతో ఆ ఒక్క ఏడాదిలోనే జననాలు 8 శాతం పెరిగాయి. అప్పటికి ఒకే బిడ్డను కలిగి ఉన్న దంపతులు రెండో బిడ్డను కూడా కనేందుకు సిద్ధపడ్డారు. గత ఏడాది చైనాలో 1.72 కోట్ల మంది జన్మించగా, 60 లేదా అంతకుమించి వయస్సు ఉన్న వృద్ధుల సంఖ్య 17.3 శాతంగా ఉన్నది. ప్రస్తుతం 140 కోట్లు ఉన్న చైనా జనాభా 2029 నాటికి 145 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నారు. కాగా ఏక సంతానం విధానం అమలుతో దాదాపు 40 కోట్ల జననాలను అడ్డుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

(ANN NEWS)